మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ
జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర
పాల్గొన్న మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, లక్ష్మణ్
మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం
విధాత, ప్రత్యేక ప్రతినిధి: చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు…బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉద్ఘాటించారు. వారి సంస్కృతి మన అస్థిత్వం…వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర…వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి అంటూ కొనియాడారు. జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026(Medaram Jatara 202) పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమ్మక్క – సారక్క మనుషుల్లో దేవుళ్లు…ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి…వారి చరిత్రను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించే దైవ సంకల్పం…మేడారంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సత్కార్యమని అభివర్ణించారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరుగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.
– మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శీతాకాల విడిది కోసం ముర్ము ప్రస్తుతం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జాతరకు ఆహ్వానించనున్నారు. మరోవైపు మేడారం గద్దెల పనులు, జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
