Site icon vidhaatha

ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ

– అవినీతి నేతలు బీహార్ జైలుకే

– భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడి


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ, మార్చిలో గ్రూప్ -2 నిర్వహిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని తీహార్ జైలుకు పంపుతామని, వంద రోజుల్లో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఆయ‌న వెల్ల‌డించారు. బుధవారం బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో రూ.6 కోట్ల 31 లక్షలతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మైలారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాన్ని ప్రారంభించారు. బెడ్ల ఏర్పాటు కోసం మంత్రి సొంత డబ్బులు రూ.50 వేలు స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి మాట్లాడారు. వంద రోజుల్లో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. హాజీపూర్ బ్రిడ్జిని 6 నెలల్లోపు పూర్తి చేస్తామని, అలాగే హాజీపూర్ గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అఘాయిత్యాలకు బలైపోయిన బాలికల కుటుంబాలకు అండగా ఉంటామని, బాధిత కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కుటుంబంలో అర్హులైన వారికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రూ.17 కోట్లతో కొలనుపాక బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని, జైన దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం కింద ఐదు లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచి అండగా ఉన్నామని తెలిపారు. చెప్పిన పనులే కాకుండా, చెప్పని పనులు కూడా చేస్తున్నామని అన్నారు. చీకటిమామిడి – వడపర్తి, నాగినేనిపళ్లి – అనంతారం, మర్యాల- చీకటిమామిడి రోడ్ల పనులు వారం రోజుల్లో టెండర్ పిలిచి పనులు చేపడతామని అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ హాజీపూర్ లో బ్రిడ్జి నిర్మాణంతో దూరాభారం తగ్గుతుందని, బ్రిడ్జి శాంక్షన్ చేసిన మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు, కే జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Exit mobile version