కుటుంబ సభ్యుల ఆందోళన
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన కోడి భవ్య, గాదె వైష్ణవి అనే విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పటిలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ హాస్టల్‌లో ట్యూషన్‌కు వెళ్లలేదని..ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో అనుమానం వచ్చి ఓ విద్యార్థిని గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరు అప్పటికే ఫ్యాన్లకు వేలాడుతున్నారు. చూసిన వెంటనే సదరు విద్యార్థి సిబ్బందికి చెప్పింది. వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. విద్యార్థినిలు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో మా శైలజ మేడం మంచిదని ఆమెను ఏమి అనవద్దని, మేం చేయని తప్పుకు అందరు మమ్మల్ని అంటుంటే మేం ఆ మాటలు భరించలేకపోతున్నామంటు రాశారు. అలాగే మా ఇద్దరికి ఒక దగ్గరే సమాధి కట్టాలని కోరారు. సూసైడ్ నోట్ వారు రాసిందేనా, లేదా అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఉద్రిక్తంగా మారిన కుటుంబ సభ్యుల ఆందోళన
తమ పిల్లల ఆత్మహత్యలకు అసలు కారణాలను బయటకు తీసి దోషులను శిక్షించి మాకు న్యాయం చేయాలంటూ బాలికల తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిచినప్పుడు వారిని కొట్టారని ఆరోపిస్తు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావులు వారిని శాంతింపచేసే ప్రయత్నం చేశారు. వారిపై కూడా మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.