విధాత, హైదరాబాద్ : విజయవాడ-హైదరాబాద్ రహదారి మీదుగా నగరానికి వచ్చే ప్రయాణీకులతో పాటు నగర ప్రజలకు నగర ప్రజలకు హయత్ నగర్ వరకు మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది.. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మెట్రోను పొడిగించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. నగరంలో మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎల్బీ నగర్ టూ హయత్ నగర్ ఎంపికైంది. ఎల్బీనగర్ నుంచి చింతల్ కుంట, ఆటో నగర్, వనస్థలిపురం, మహావీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్ వరకు అన్ని ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే స్టేషన్ పాయింట్ ఎక్కడ ఉంది? స్టేషన్ల పేర్లకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నారు.