- ఆ రెండు నియోజకవర్గాల్లో బీఆరెస్‌ను ఓడిస్తాం
- ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ సవాల్
విధాత, హైద్రాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే హైద్రాబాద్‌లో పోటీ చేయాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ సవాల్ చేశారు. శుక్రవారం ఎంఐఎం పోటీ చేయనున్న తొమ్మిది స్థానాలకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా అసదుద్ధిన్ మాట్లాడుతూ తనపై పోటీ చేస్తే రాహుల్‌గాంధీకి తన సత్తా ఏమిటో చూపిస్తానన్నారు. బాబ్రీమసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆరెస్సెస్ మాదిరిగానే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందన్నారు.
కాంగ్రెస్ సెక్యులరీజం జూటా సెక్యులరిజమన్నారు. పొలిటికల్ సెక్యులరిజమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఎంఐఎం ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. 2019లోక్ సభ ఎన్నికల్లో ఆమేధి నుంచి ఓడిపోవడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నానని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. 2014, 2019ఎన్నికల్లో ఓడిపోవడానికి మీరు బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్నారా అంటూ రాహుల్‌ను నిలదీశారు.
ఎంఐఎం సత్తా ఏమిటో రాహుల్‌కు తెలియదని, ఆయన నాయనమ్మకు బాగా తెలుసన్నారు. తెలంగాణలో ఎంఐఎం పోటీ చేయని నియోజకవర్గాల్లో బీఆరెస్‌కు మద్దతునిస్తుందన్నారు. జూబ్లిహిల్స్‌లో అజారుద్ధిన్ తమ వాడు కాదని, కాంగ్రెస్ అభ్యర్ధి అన్నారు. వైఎస్సార్టీపీ అధినేత వైఎస్.షర్మిల ఎవరో నాకు తెలియదని, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో తెలియదన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయితే తోపా అని, అది ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
బీఆర్‌ఎస్ ఎవ్వరి మద్దతు లేకుండానే అధికారంలోకి వస్తుందని తెలిపారు. బీఆరెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తొమ్మిది నియోజక వర్గాల్లో ఎంఐఎంకు ఓటు వేయాలని కోరారు. రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్‌లలో బీఆరెస్ అభ్యర్థులు ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్‌లను ఓడగొడతామని స్పష్టం చేశారు. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పారిపోయారని.. ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్‌లో సీఎం నువ్వా నేనా అని కొట్లాడుతున్నారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీసీ కదా మరి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇక ఆ పార్టీ చెప్పే బీసీ ముఖ్యమంత్రి మాటను ఎలా నమ్మాలని అసదుద్దీన్ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై డ్యాం సెఫ్టీ అథార్టీ ఇచ్చిన నివేదికను నేను చూడలేదని, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారని అలాంటప్పుడు రాష్ట్ర ఖజానాపై భారం ఉండబోదన్నారు.