నల్లమల అటవీ పర్యాటక ప్రాంతాల సందర్శనకు మంత్రి జూపల్లి

న‌ల్ల‌మ‌ల‌ను ప‌ర్యాట‌క హాబ్‌గా తీర్చిదిద్ద‌డంలో భాగంగా ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారుల బృందం జూలై శుక్ర, శనివారాల్లో న‌ల్ల‌మ‌ల‌లో ప‌ర్య‌టించ‌నుంది.

  • Publish Date - July 4, 2024 / 04:40 PM IST

విధాత : న‌ల్ల‌మ‌ల‌ను ప‌ర్యాట‌క హాబ్‌గా తీర్చిదిద్ద‌డంలో భాగంగా ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారుల బృందం శుక్ర, శనివారాల్లో న‌ల్ల‌మ‌ల‌లో ప‌ర్య‌టించ‌నుంది. రెండు రోజుల స్ట‌డీ టూర్‌లో భాగంగా ప‌ర్యాట‌క అభివృద్ధి, మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న‌, స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్ప‌న‌, త‌దిత‌ర అంశాల‌పై క్షేత్ర‌స్థాయిలో అధ్య‌య‌నం చేయ‌నున్నారు. న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎకో, టెంపుల్, రివ‌ర్ టూరిజం సమూహాల అభివృద్ధి, వ‌స‌తుల క‌ల్ప‌న‌పై క‌స‌రత్తు ప్రారంభించింది.

ప‌ర్యట‌న వివ‌రాలు..

మంత్రి జూపల్లి బృందం నల్లమల పర్యటనలో భాగంగా ముందుగా మ‌న్న‌నూర్‌లోని ఈఈసీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంట‌ర్, బ‌యో ల్యాబ్, వ్యూ పాయింట్, క‌ద‌లైవ‌నం సంద‌ర్శ‌న‌, బెహ్ర‌పూర్ ఆల‌య ద‌ర్శ‌నం, మ‌ల్లెల తీర్థం జ‌ల‌పాతం, వ‌జ్రాల మ‌డుగు, అక్టోప‌స్ వ్యూ పాయింట్ సంద‌ర్శిస్తారు. శనివారం అక్క‌మాంబ బిల్లం, రివ‌ర్ బోటింగ్, మద్దిమడుగు ఆంజనేయస్వామి ద‌ర్శ‌నం, గీసుగండీ రివ‌ర్ పాయింట్, గున్నంపేట‌, రాయ‌ల‌గండి, అంత‌ర్‌గంగా సంద‌ర్శ‌న, మ‌న్న‌నూర్ జంగిల్ రిసార్ట్, ప్ర‌తాప‌రుద్రుని కోటను సంద‌ర్శిస్తారని అధికారులు వెల్లడించారు.

Latest News