ఎక్సైజ్ శాఖపై బీఆరెస్ దుష్ప్రచారం
మంత్రి జూపల్లి స్పష్టీకరణ
విధాత, హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామన్న ప్రచారంలో నిజం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్త మద్యం బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు దానిపై పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాలసీలు ఏమైనా ఉంటే అవన్నీ కేబినెట్ లో నిర్ణయం జరుగుతాయన్నారు. కొత్త మద్యం పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 19 మద్యం డిపోలలో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని, మద్యం కొరత ఉంటే అమ్మకాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టం తప్ప ప్రజలకు కాదన్నారు. తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు.
మద్యం అమ్మకాల సెల్స్ తగ్గితే బీఆరెస్ పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా అని ఎద్దేవా చేశారు. కొంత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టే బీర్ల షార్టేజ్ వచ్చిందని, రాష్ట్రంలో బీర్లకు కొరత లేదని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, మేము ఒక్కొక్కటి గా బకాయిల చెల్లింపులు చేస్తున్నామన్నారు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసిందని, టానిక్ కు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని వెల్లడించారు. తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారని చెప్పారు.
గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావని, ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో తప్పుడు రాతలు రాసిన నమస్తే తెలంగాణ పత్రికపై 100కోట్ల పరువు నష్టం వేస్తామన్నారు. జూపల్లి మంత్రిగా ఉన్న శాఖలో అవకతవకలు, అవినీతి అనేది ఉండదని చెప్పారు. బీఆరెస్ పార్టీ మనుగడ కష్టంగా ఉండటంతో మా ప్రభుత్వం పై తప్పుడు వార్తలు రాస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆరెస్ నేతల మాటలు ఉన్నాయని, గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు మా ప్రభుత్వంలో జరిగాయని, ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామన్నారు.