Minister Komatireddy | పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను రానున్న మూడునాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు

  • Publish Date - June 22, 2024 / 05:16 PM IST

త్వరలో ఎస్‌ఎల్బీసీకి సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
హాజరైన మండలి చైర్మన్ గుత్తా

విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను రానున్న మూడునాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. శనివారం నల్లగొండ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా ఏకకాలంలో 31వేల కోట్లతో 2లక్షల వరకు రుణమాఫీ చేయబోతుందన్నారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన విడతల వారి రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజ కల్గలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఉమ్మడి జిల్లాలోని రోడ్లు, జాతీయ రహదారులు, 30వేల కోట్లతో రాబోతున్న త్రిబుల్ ఆర్ రోడు్డ సహా అన్ని రోడ్లు పూర్తి చేయిస్తామన్నారు. జిల్లాలో ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ పథకం అందడం లేదని, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారని, నా స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలలో కూడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరినట్లుగా ఎస్‌ఎల్బీసీ, ఉదయ సముద్రం, డిండి, పెండ్లిపాకల, నక్కలగండి, మూసీ ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలను మూడేళ్లలోగా పూర్తి చేసేలా చూస్తామన్నారు. నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని, రోడ్లు, భవనాలకు నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సూచించారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అసంపూర్తి పనులను ముందుగా చేపట్టాలి : గుత్తా

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ,మిషన్ భగీరథ ద్వారా అంతటా నీటి సరఫరా అవ్వడంలేదని ,తన సొంత గ్రామంలోనే సగం గ్రామానికి మాత్రమే తాగునీటి సరఫరా అవుతుందని చెప్పారు. అలాగే జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరి దశలో ఆగిపోయినాయి అని, వాటికి త్వరగా నిధులను విధుల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. డిండి ,పెండ్లిపాకల, నక్కల గండి, ఉదయసముద్రం ,ఎస్ యల్ బి సి ,ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ధర్మారెడ్డి, పిలాయి పల్లి కెనాల్స్ పనులు పూర్తయ్యాయి.

కానీ చివరి ఆయకట్టు వారికి నీరు రాకుండా మోటార్లు, పైపు లైన్స్ ద్వారా అక్రమంగా నీటిని తీసుకొని వెళుతున్నారని అధికారులు త్వరగా స్పందించి నీటిని అక్రమంగా తీసుకువెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎస్‌డీఎఫ్‌ నిధులను విడుదల చేసి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. గతంలో మన ఊరు – మన బడి ప్రోగ్రాంలో పనులు ప్రారంభం అయ్యి అసంపూర్తిగా ఉన్నాయని, విద్యాశాఖ అధికారులు వాస్తవ పరిస్థితినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను వారు ఘనంగా సన్మానించారు. సాంఘిక సంక్షేమ స్థాయి సంఘ చైర్మన్, మునుగోడు జడ్పీటీసీ శ్రీమతి నారబోయిన స్వరూప రాణి రవి ముదిరాజ్ ప్రభృతులు పాల్గొన్నారు.

Latest News