Minister Komatireddy | కేసీఆర్ స్కీమ్‌లన్ని స్కామ్‌లే.. ఉద్యమంలోనూ వసూళ్లే

మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లన్ని స్కామ్‌లుగా మారాయని గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పేరిట వేలకోట్లు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

  • Publish Date - June 2, 2024 / 05:03 PM IST

తెలంగాణ జిన్నాగా మారాడు
పార్లమెంటు ఫలితాల తర్వాతా బీఆరెస్ ఉండదు
ప్రభాకర్‌రావును రావద్దని చెప్పేందుకే హరీశ్‌రావు ఆమెరికా వెళ్లారు
ఉద్యమంలోనూ వసూళ్లే
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌లన్ని స్కామ్‌లుగా మారాయని గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పేరిట వేలకోట్లు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వింత అని చెప్పిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మూడళ్లకే కూలిపోయిందని, మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్లతో భారీ స్కామ్‌లు చేశాడని, రైతుబంధును వందల ఎకరాలున్న వారికి కూడా ఇచ్చాడని విమర్శించారు. దళిత బంధు, బీసీ బంధు అంతా అవినీతి మయమయ్యాన్నారు. బీఆరెస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు. 70వేల మంది టీచర్లు రిటరైనప్పటికి డీఎస్సీ వేయలేదని తప్పుబట్టారు.

పంద్రాగస్టుకు కాంగ్రెస్‌ రూ.2లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. అధికారం పోయి.. బిడ్డ కవిత జైల్లో ఉందని కేసీఆర్ బాధలో ఉన్నారన్నారు. కేసీఆర్ మంత్రి పదవి రాకపోవడంతో తెలంగాణ ఉద్యమం చేపట్టారని, ఉద్యమాన్ని సైతం ఆర్ధికంగా వాడుకున్నాడని, కేసీఆర్‌తో భోజనం చేయాలంటే లక్ష వసూలు చేసే వారని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఉద్యమం సమయంలో ఆంధ్రా వ్యాపారస్తుల వద్ద కేసీఆర్ కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామాలు చేసింది కూడా కలెక్షన్ల కోసమేనని విమర్శించారు. ఉద్యమ సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారన్నారు. మెట్రో రైలు ఆరేళ్లు ఆలస్యమవ్వడానికి కేసీఆర్ కారణమన్నారు.

ప్రభాకర్‌రావును ఆపేందుకే హరీశ్‌రావు ఆమెరికా వెళ్లారు

అధికారం కాపాడుకునేందుకు కేసీఆర్ రాక్షసుడిలాగా వ్యవహరించారని.. నీచమైన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లూ చేశారన్నారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ దగ్గర పనిచేసిన అధికారులు జైలుకు పోయారన్నారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయనను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారన్నారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు. ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఆపేందుకే హరీష్ అమెరికా వెళ్లారన్నారు. మే 26న ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ ఈకే 525లో హరీశ్‌రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు.

ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏ ఫ్లైట్లో వెళ్లాడో.. ఎక్కడ కలిశాడో నిరూపిస్తానన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. తాను దేనికైనా సిద్ధమే అన్నారు. ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారని… ప్రభాకర్ రావు అప్రూవర్‌గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్‌రావుకి ఏమోచ్చిందని నిలదీశారు. ఎన్ని రోజులైనా కేసీఆర్‍ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇద్దరు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ప్రభాకర్ రావును వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపోవాలని కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కూడా తన తప్పు ఒప్పుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

తెలంగాణ జిన్నా కేసీఆర్‌

కేసీఆర్‍కు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని చెప్పారు. తెలంగాణ జిన్నా లాగా కేసీఆర్ మారారని ఎద్దేవా చేశారు. జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకునే వారని సెటైర్లు గుప్పించారు. కేసీఆర్ కూడా ఒకరోజు ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారని విమర్శించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన అని అబద్ధం చెప్తున్నాడని విమర్శించారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని, అనంతరం గద్దె నెక్కి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఎన్ని మాటలు అన్నాడని మంత్రి గుర్తు చేశారు.

బీఆరెస్ ఓటమితో రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కలిసి కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని ఆరోపణలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వెయ్యి కోట్లు ఇస్తే పూర్తయ్యేదని, వెయ్యి కోట్లు ఇవ్వకుండా మోసం చేసి, నల్గొండ, మహబూబ్ నగర్‌లను ఎండబెట్టారని.. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్‌కు వచ్చిందా అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరే అని రైతులకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నారని వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కరెంట్ గురించి మాట్లాడుతున్నారని.. ఛత్తీస్ ఘడ్‌లో ఎక్కువ ధరకు కరెంట్ కొన్నారని, ప్రభాకర్ రావు ఎప్పుడు చూసినా ఆసుపత్రిలో ఉన్నా అనేవాడని, ఆయన కరెంట్ పై ఏం సమీక్ష చేశారని.. నెల రోజుల్లో కరెంట్ దోపిడీ అంతా బయటకు వస్తుందన్నారు. విచారణ నివేదిక బయటకు వస్తుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి వచ్చే మొహం కేసీఆర్‌కి లేదన్నారు. కేసీఆర్ ఎన్ని కేబినెట్ మీటింగ్ పెట్టారంటూ ప్రశ్నించారు. తెలివి ఉన్నోడని చెప్పుకునే కేసీఆర్‌ 11 శాతం వడ్డీతో అప్పులు ఎట్లా తెచ్చాడని మండిప్డారు. లిక్కర్ స్కామ్, టానిక్ కంపెనీలు పెట్టుకోవడమే కేసీఆర్ చేసిందంటూ తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆరెస్‌లో ఎవరూ ఉండరని చెప్పారు. కుటుంబ సభ్యులు జైల్లో ఉంటారన్నారు.

Read More

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

Sonia Gandhi | ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది

Election Result | అరుణాచల్‌ మళ్లీ బీజేపీదే ..సిక్కింలో ఎస్కేఎం స్వీప్‌

Latest News