Site icon vidhaatha

మంత్రి వెంకట్‌రెడ్డికి బైపాస్ సెగ

ఘెరావ్ చేసిన బైపాస్ రోడ్డు బాధితులు

విధాత, హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం మంత్రి వెంకట్‌రెడ్డి తన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కనగల్ మండలం దర్వేశిపురం వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్నారు. బాధితులు మంత్రికి తమకు బైపాస్ రోడ్డుతో ఎదురవ్వనున్న కష్టనష్టాలను ఏకరవు పెట్టుకున్నారు.

అయితే ఈ విషయంలో తానేమీ సహాయం చేయలేనంటూ మంత్రి చెప్పడంతో బాధితులు ఆయన కాళ్లపై పడుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అవసరమైతే తాను మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇస్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యేనే ఉన్నారన్న నమ్మకంతో వచ్చిన బైపాస్ బాధితులకు మంత్రి నుంచి ఆశించిన స్పందన దక్కకపోవడంతో మంత్రి వైఖరితో నిరాశకు గురైన బైపాస్ బాధితులు మునుముందు తమ ఆందోళన మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు.

Exit mobile version