Minister Ponnam | బూడిద అక్రమ రవాణ ఆరోపణలపై పొన్నం లీగల్ నోటీసులు

బొగ్గు బూడిద(ఫ్లై యాష్) తరలింపులో అవకతవకలతో మంత్రి పొన్నం అక్రమార్జన చేశారంటూ తనపై చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ సహా నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూ ఛానెల్‌కు నోటీసులు పంపారు

లీగల్‌గానే చూసుకుంటామన్న పాడి కౌశిక్‌రెడ్డి

విధాత : బొగ్గు బూడిద(ఫ్లై యాష్) తరలింపులో అవకతవకలతో మంత్రి పొన్నం అక్రమార్జన చేశారంటూ తనపై చేసిన ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ సహా నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూ ఛానెల్‌కు నోటీసులు పంపారు. కాగా తమకు పొన్నం పంపించిన లీగల్ నోటీస్‌లపై పాడి కౌశిక్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొన్నం లీగల్ నోటీస్‌లకు తమ లీగల్ టీమ్ బరాబర్ జవాబు చెబుతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఇల్లీగల్ యాక్టీవిటీస్‌ని లీగల్ నోటీసులు పంపి ఆపాలనుకుంటే కుదరదు బ్రదర్ అంటూ మండిపడ్డారు.

నిబంధనల ఉల్లంఘనలపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ఓవర్ లోడ్ లారీలను వెళ్లనిస్తారా అని ప్రశ్నించారు. 34 టన్నులు లోడుతో వెళ్లాల్సిన లారీలు 80 టన్నుల లోడ్‌తో వెళ్లడంపై సమాధానం చెప్పాలని మంత్రి పొన్నంను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బుక్ లో అధికారుల పేర్లు రిజస్టర్ చేస్తున్నామన్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి తమ ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు.