మన అంగన్‌వాడీలు దేశానికే రోల్ మోడల్‌గా ఉండాలి: మంత్రి సీతక్క

సీఎం ఆలోచనలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలు దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా కొన్ని అంగన్‌వాడీ భవనాలు పెచ్చులు ఊడే ప్రమాదం ఉందని, అటువంటి భవనాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు

విధాత, హైదరాబాద్: సీఎం ఆలోచనలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలు దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా కొన్ని అంగన్‌వాడీ భవనాలు పెచ్చులు ఊడే ప్రమాదం ఉందని, అటువంటి భవనాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వం భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేట్ భవనాలలోకి మార్చాలని సూచించారు.

రాత్రి వేళల్లో తేళ్ళు, జెర్రీలు వంటి విష పురుగులు అంగన్‌వాడీ కేంద్రాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఇలాంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొన్ని చోట్ల చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని, కఠినమైన చర్యలు ఉంటాయిని హెచ్చరించారు.

జిల్లా అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను విధిగా సందర్శించాలని, హాజరు శాతాన్ని పెంచాలన్నారు. దేశంలో అంగన్‌వాడీ సేవలను ప్రవేశపెట్టిన ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19 అని ఆలోపే నిర్దేశించుకున్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరా గాంధీ జయంతి రోజే ప్రభుత్వం 1000 నూతన అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించనుందన్నారు. నిర్మాణాలకు నిధులు సరిపోకపోతే అదనంగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీడింగ్, టీచింగ్, అటెండెన్స్ మీద యంత్రాంగమంతా దృష్టి పెట్టాలని సీతక్క వెల్లడించారు.