MLA Durgam |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్మే క్యాంప్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ ఉద్యోగులు తరలివెళ్లారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం అందజేసి, సమస్యలు వివరించారు.
ఈసందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. అంగన్వాడీలకు హితబోధ చేస్తూ.. ‘ఎర్రజెండా పట్టుకు తిరిగితే మీకు న్యాయం జరగదు. వీళ్ళు మిమ్మల్ని అందరినీ సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. వీళ్ళు మోసం చేస్తారు’ అంటూ సీపీఎం, సీఐటీయూ నాయకులను ఉద్దేశించి అన్నారు. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ ఎమ్మెల్యే మరోసారి దురుసుగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న స్థానిక కౌన్సిలర్, అనుచరుడు మరింత రెచ్చిపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, మిగతా నాయకులపై దాడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీపీఎం శ్రేణులు అక్కడే ఆందోళన కొనసాగించారు.
సమస్యలు చెప్పుకునే హక్కు మాకు లేదా? సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
మా సమస్యలు చెప్పుకునే హక్కు మాకు లేదా ? అంటూ ఎమ్మెల్యే వైఖరిని, దాడి చేసిన కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు సీపీఎం శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే రౌడీయిజం, గుండాయిజం మరోసారి బయటపడిందన్నారు.
అతను ఒక ఎమ్మెల్యే అని మరిచిపోయి ఇలా గుండా గిరి చేసాడా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేకు ప్రజలను బయపెట్టాలని, బెదిరించాలని, దాడి చేయాలనే చెప్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బేషరుతుగా అంగన్వాడీలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా పోలుసులు జోక్యం చేసుకొని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిరసనలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గుమస ప్రకాష్, దూలం శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి రాజేశ్వరి, నాయకులు దాగం రాజారాం, ఈ భానుమతి, రాజమణి, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు సత్యవతి, శంకరమ్మ, అనురాధ, మహేశ్వరి, రాజేశ్వరి, రాధాబాయ్ పాల్గొన్నారు.