Site icon vidhaatha

Miryalaguda MLA | నాటకాలు చేస్తున్నారా.. తట్ట బుట్టతో అడవి పనికి పంపుతా: అంగన్వాడీ టీచర్లపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నోటి దురుసు

Miryalaguda MLA |

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి అసహనంతో నోరు జారారు. ఇప్పటికే గతంలో అనేకసార్లు పలు కార్యక్రమాల్లో అసహనానికి గురైన ఆయన స్థానికంగా ఉన్న ప్రజలపై చిరుబూరులాడిన సంఘటనలు మరువకముందే, తాజాగా అంగన్వాడీలపై నోరు పారేసుకున్నారు. మరోసారి ఎమ్మెల్యే ప్రజాగ్రహానికి లోనయ్యారు.

శనివారం అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా తమ సమస్యలను ఎమ్మెల్యే భాస్కర్ రావుకు విన్నవించుకునేందుకు వెళ్లిన అంగన్వాడీ సిబ్బంది, టీచర్లపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్య వినకుండానే ‘నా దగ్గరికి వస్తారా? నాటకాలు చేస్తున్నారా.. తమాషాలు చేస్తున్నారా.. ’ అంటూ అసహనంతో ఊగిపోయిన ఎమ్మెల్యే.. ‘నేను తలుచుకుంటే మీ అందరిని అడవిలో తట్ట బుట్ట ఇచ్చి పార పనికి పంపిస్తా. నాటకాలు చేయొద్దు. ప్రభుత్వం పైనే ఉద్యమాలు చేస్తారా?’ అంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

ఎమ్మెల్యే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో వారు అవాక్కయ్యారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యే తమకెందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రెండు సార్లు తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఏనాడు సమస్యలపై సానుకూలంగా స్పందించడని అంటున్నారు.

మహిళలు అనే గౌరవం కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడిన ఎమ్మెల్యే తీరును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటున్నారు. ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే వైఖరిపై రాష్ట్ర అంగన్వాడీ సిబ్బంది ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Exit mobile version