వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన
అధికారులతో మంత్రి సమీక్ష
విధాత, వరంగల్ ప్రతినిధి: వరుస వర్షాల నేపథ్యంలో రిస్క్ తీసుకోకుండా పూర్తిస్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరదలతో ఎక్కువగా ప్రభావితం అయ్యే లోతట్టు గ్రామాల ప్రజలకు జిల్లా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సోమవారం ములుగు మండలం బండారు పల్లిలోని రాళ్ళవాగు, మెడివాగు,గోవిందరావు పేట మండలంలోని దయ్యాల వాగు, బోగత జలపాతం వరద ప్రవాహాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ రావద్దని, ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లకుండా అధికార యంత్రాంగం గస్తీ పెంచాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ములుగు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ, పోట్లను ఎన్టీఆర్ యఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీతక్క భరోసా ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇష్టపడే సీతక్క గత నాలుగు ఐదు రోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అదే సమయంలో ములుగు లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ, ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో తన ప్రజలకు దూరంగా హైదరాబాదులో సీతక్క ఉండలేకపోయారు. గతేడాది వర్షాలతో ములుగు వనికిపోయింది. వరదల్లో పలువురు మృత్యువాత పడ్డారు. అప్పుడు స్వయంగా ప్రజలకు అండగా నిలిచి సహాయక చర్యల్లో సీతక్క పాల్గొన్నారు.
ఇప్పుడు వర్ష జోరు పెరిగి నేపథ్యంలో జ్వరంతో బాధపడుతూనే ఎడతెరిపిలేని వర్షంలోనే ములుగు కు చేరుకుని వర్షాలు వరదలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. వరద ఉదృతిని పరిశీలించారు. గోదావరి సమీప గ్రామాల్లో వున్న పరిస్థితులను స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. ములుగు ఫ్లడ్ కంట్రోల్ రూం నుంచి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదలు నేపథ్యంలో సహాయక కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న విభాగాల అధికారులతో సమీక్ష చేపట్టారు.
వాతావరణ శాఖ మలుగు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏదైనా సమస్య తలెత్తితే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సన్నద్దతపై మంత్రి సీతక్క ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, మండల ప్రత్యేక అధికారి విజయ చంద్ర, ఆర్ అండ్ బి డి.ఈ.రఘువీర్, తహసిల్దార్, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.