Site icon vidhaatha

Minister Tummala | రుణమాఫీపై బీఆరెస్‌ దుష్ప్రచారం: మంత్రి తుమ్మల

విధాత, హైదరాబాద్ : గతంలో రుణమాఫీ సరైన పద్ధతిలో అమలు చేయడంలో విఫలమైన బీఆరెస్ పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శించారు. రుణమాఫీలో గతంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు. ఒక్కో ప్రభుత్వం ఓక్కో పరిమితితో రుణమాఫీ అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా 2లక్షల రుణమాఫీ చేస్తుందని, తొలి విడతలో లక్ష, రెండో విడతలో లక్షన్నర వరకు మాఫీ ప్రక్రియ జరిగిందన్నారు.

ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ అంశంలో ముందుకెళ్తున్నామని, ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తు రైతులతో రాజీకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాపీ చేస్తున్నామని, మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందని, పాస్‌బుక్ లేకపోయినా.. తెల్లకార్డు ద్వారా రుణమాపీ చేస్తున్నామన్నారు. రుణాలు మాఫీ కాకపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని భరోసానిచ్చారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని, రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని తుమ్మల వెల్లడించారు.

Exit mobile version