విధాత: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం అని, ప్రకృతి వైపరీత్యాల భారిన పడ్డ రైతాంగానికి బాసటగా ఉంటాం అని రాష్ట్ర పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతాంగానికి ప్రభుత్వం వెన్ను దన్నుగా నిలబడుతుందన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ సందర్శించి కొనుగోలు తీరుతెన్నులను పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు జరుపాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణా కొత్త రికార్డ్ నెలకొల్పిందని, స్వతంత్ర భారత దేశంలో ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రధమం అని, ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమం అని ఉత్తమ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా బాగాస్వామ్యం కావాలని సూచించారు.
