Site icon vidhaatha

Minister Uttam Kumar Reddy | త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీ కార్డులు: మంత్రి ఉత్తమ్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా త్వరలోనే జారీ చేస్తామని, రేషన్ కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే ఉపయోగపడుతాయని, తెల్ల రేషన్‌కార్డులకు, ఆరోగ్య శ్రీ కార్డులకు లింక్ ఉండదని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీమర లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆరెస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కారణంగా చాలా మంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు.

రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలకు కొత్త అర్హతలతో వేర్వేరు కార్డులు జారీ చేయబోతున్నామని ప్రకటించారు. ఇందుకోసం త్వరలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని, అందరి సలహాలు సూచనలు తీసుకొని పేదలకు మాత్రమే దక్కేలా మంత్రి ఉపసంఘంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏ ఫార్మాట్ లో దరఖాస్తులు తీసుకోవాలనేది కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నామని, కేబినెట్‌లో నిర్ణయించిన ఫార్మాట్ ప్రకారం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇక కేంద్రం తెలంగాణలో 54 లక్షల మందిని బీపీఎల్ కుటుంబాల కింద చూస్తుందని, మరో 35 లక్షల పైచిలుకు మందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, తెలంగాణాలో ప్రస్తుతం 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం ఇచ్చారు.

Exit mobile version