చోటా బాయ్, బడా బాయ్‌లు ఇద్దరూ ఒక్కటే: మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

ప్రజలను మోసం చేయడంలో రాష్ట్రంలోని చోటా బాయ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రంలోని బడా బాయ్‌ ప్రధాని మోదీలు ఇద్దరూ ఒక్కటేనని, వారిద్దరు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి

  • Publish Date - May 3, 2024 / 07:06 PM IST

  • ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-బీజేపీ కుమ్మక్కు
  • 16సీట్లలో బీఆరెస్ గెలుపు ఖాయం

విధాత : ప్రజలను మోసం చేయడంలో రాష్ట్రంలోని చోటా బాయ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రంలోని బడా బాయ్‌ ప్రధాని మోదీలు ఇద్దరూ ఒక్కటేనని, వారిద్దరు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు లోపాయికారి కుమ్మక్కు రాజకీయాలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ప్రజలకు అర్దమైపోయాయని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ బీఆరెస్‌తోనే సాధ్యమని వారు గ్రహించారన్నారు.

రాష్ట్రానికి మోదీతో ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన బస్సు యాత్రతో రేవంత్ రెడ్డికి వణుకుడు మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే రైతులకు సాగునీరు, విద్యుత్తు కొరత, ప్రజలకు తాగునీరు కొరత ఏర్పడ్డాయన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పట్టించుకునే దిక్కు లేదన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడింది ఒక్క కేసీఅర్ మాత్రమేనన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆరెస్ 16సీట్లు గెలబోతుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి బీఆరెస్ ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News