Kadiyam Srihari : స్పీకర్ ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

అనర్హత కేసు విచారణకు ముందు కడియం శ్రీహరి స్పీకర్ ను కలిశారు. వివరణకు సమయం కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దానం విచారణపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Kadiyam Srihari

విధాత, హైదరాబాద్ : అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. తాజాగా కడియంతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ గడువుకు ముందే కడియం శ్రీహరి స్పీకర్ ను కలవడం విశేషం. తనకు వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ ను కోరారు. అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.

మరోవైపు స్పీకర్ నోటీసుల మేరకు దానం నాగేందర్ ఈ నెల 23న విచారణకు హాజరవుతారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 8మందికి సంబంధించిన విచారణను స్పీకర్ పూర్తి చేశారు. దానం, కడియంలు గతంలో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై దానం ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

స్పీకర్ పై పెరిగిన ఒత్తిడి…

ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను మూడు నెలలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు విధించిన గడువు ఆక్టోబర్ 1తో ముగిసిపోయింది. గడువులోగా విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోవడంతో బీఆర్ఎస్ తాజాగా సుప్రీంకోర్టులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. అటు స్పీకర్ సైతం తనకు విచారణకు మరో స్పీకర్ మరో ఎనిమిది వారాల గడువు కావాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు స్పీకర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యూఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని నిర్ధేశిస్తూ..విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో దానం, కడియంల విచారణ వ్యవహారం స్పీకర్ కు తప్పనిసరిగా మారిపోయింది.

Latest News