విధాత, హైదరాబాద్ :
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత మరో ఇద్దరు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆమె అనుచరులు మహేశ్వరం చెరువుల కబ్జా చేస్తున్నా సబితా సైలెంట్ గా ఉన్నారని, దీన్ని హైడ్రా కూడా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. శుక్రవారం జాగృతి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన జనం బాటలో కవిత మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందేని డిమాండ్ చేశారు. వాషింగ్ పౌడర్ నిర్మా రాజకీయాలు మనకెందుకన్నారు. కబ్జాలు చేసినోళ్లే ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాలో చెరువులు ఎమ్మెల్యేలే కబ్జా పెడితే హైడ్రా నిద్రపోతుందా? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? అని కవిత ప్రశ్నించారు. ‘రంగారెడ్డి జిల్లాలో కబ్జాల గురించి తాము మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వెళ్లేందుకు చర్చలు చేస్తున్నారంట. కబ్జాలు చేసే వాళ్లు కాంగ్రెస్ చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్లుగా క్లీన్ అయిపోతున్నారా?. ఆర్ఆర్ఆర్ ఆలైన్ మెంట్లను సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ నేతల కోసం మార్చుతున్నారు. సామాన్య రైతులకు అన్యాయం చేస్తున్నారు. వారందరితో నితిన్ గడ్కరీని కలుస్తా. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జాగృతి పనిచేస్తుంది’ అని కవిత వెల్లడించారు.
అన్ని వర్గాలకు మేలు జరిగేలా పోరాటం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని తెలిపారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటున్న కాంగ్రెస్ కచ్చితంగా బీసీ వ్యతిరేక ప్రభుత్వమేనని ఆరోపించారు. జాగృతి జనం బాట స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం అట్టుడుకుతున్న సమయంలో మన సంస్కృతి, పండుగలు కాపాడేందుకు జాగృతి పోరాటం చేసిందని గుర్తు చేశారు. ‘మనం భౌగోళికంగా మాత్రమే తెలంగాణ సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరముంది. సామాజిక తెలంగాణ అంటే ఎన్నడు అసెంబ్లీ, గ్రామ పంచాయితీ పదవులు దక్కని వారికి అవకాశాలు వచ్చేలా చేయాలి. యువకులు, మహిళలు, బ్యాక్ గ్రౌండ్ లేని యువతకు రాజకీయ అవకాశాలు రావాలి. ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి’ అని చెప్పారు.
‘డబ్బు ఉంటే అసలు కులాల గురించి ఎవరు పట్టించుకోరు. నేను గట్టిగా నమ్మేది డబ్బు ఉన్న కులం, లేని కులం ఈ రెండు మాత్రమే. వివక్ష పోవాలంటే అన్ని వర్గాల వారు కూడా ఆర్థికంగా బలంగా తయారు కావాల్సిన అవసరముంది. వాటి సాధనలో భాగంగా సమస్యలను అర్థం చేసుకోవటానికి తెలంగాణ అంత తిరుగుతున్నాం. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను తెలుసుకుంటున్నాం. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజల సమస్యలు, భావోద్వేగాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనం బాట కార్యక్రమం చేపట్టాం’ అని కవిత వివరించారు.
