Telangana Speaker Notices|ఎమ్మెల్యేలు దానం, కడియంలకు స్పీకర్ నోటీసులు

ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పీకర్ తన నోటీసులో వారికి స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Danam Nagender), కడియం శ్రీహరిల(Kadiyam Srihari)కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad Notices)గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్ల(Disqualification Case)పై అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పీకర్ తన నోటీసులో వారికి స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనర్హత పిటిషన్ల విచారణ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10మందికి గతంతో స్పీకర గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా 8మంది ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలు అఫిడవిట్లు సమర్పించడంతో పాటు విచారణకు కూడా హాజరయ్యారు. అనర్హత పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తి కావడంతో స్పీకర్ మరో ఎనిమిది వారాల గడువు కావాలని కోరారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆయా పిటిషన్లను విచారణ చేపట్టి..ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని నిర్ధేశిస్తూ..విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్బంగా స్పీకర్ ఈ కేసులో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ..ఈ కేసులో తాము ఇదివరకే స్పీకర్ రాజ్యాంగ రక్షణ పొందలేరని చెప్పామని, అందువల్ల కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలన్న స్వేచ్చను ఆయనకే వదిలేస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో మరోసారి దానం, కడియంలకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. గురువారం  స్పీకర్ చాంబర్లో  ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ  విచారణ కొనసాగింది. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను స్పీకర్ పూర్తి చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేందర్..!

అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అనర్హత వేటు పడితే మళ్ళీ ఆరేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని..అప్పటివరకు వేచి చూస్తే నష్టమని.. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తేనే మంచిదనే యోచనలో దానం ఉన్నారన్న ప్రచారం వినిపిస్తుంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత కత్తి వేలాడుతుంది. అటు స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లో చేరిపోగా..ఆయన కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు.

Latest News