ఫిరాయింపు ఎమ్మెల్యేల రెండో విడత విచారణ షురు !

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి రెండో విడత విచారణ ప్రక్రియన స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం అసెంబ్లీ కార్యాలయంలో ప్రారంభించారు. నలుగురు ఎమ్మెల్యేలు డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలను రెండో విడతలో విచారణ చేయనున్నారు.

విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి రెండో విడత విచారణ ప్రక్రియన స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం అసెంబ్లీ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లను రెండు దఫాలుగా విచారించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలను రెండో విడతలో విచారణ చేయనున్నారు. గురువారం ఉదయం తెల్లం వెంకట్రావు, మధ్యాహ్నం డాక్టర్ సంజయ్ లను విచారిస్తారు. వారిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డిలతో పాటు ఇరువైపుల న్యాయవాదులను స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. రేపు కూడా వారి విచారణ కొనసాగనుంది.

ఈనెల, 12, 13 తేదీలో మిగిలిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తొలి విడతలో విచారించిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై జడ్జిమెంట్ ను రిజర్వ్ చేశారు. రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ రిజర్వ చేసి..మిగిలిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అంశంపై క్లారిటీ తీసుకుని జడ్జిమెంట్ వెల్లడించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో స్పీకర్ కు ఇచ్చిన మూడు నెలల గడువు ఆక్టోబర్ 31తో ముగిసిపోగా..మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.