రేవంత్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కోమ‌టిరెడ్డి కుట్ర‌

పంద్రాగ‌స్టు లోపు రుణ‌మాఫీ చేస్తామ‌న్న రేవంత్ రెడ్డి తన. రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వ‌డం లేదని, ఆయ‌న మీద ఆయ‌న‌కే న‌మ్మ‌కం లేదా అని.. ఓట్లు దండుకోవాల‌నే అబద్దపు మాటలు చెప్పారా అని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు

  • Publish Date - April 27, 2024 / 07:28 PM IST

  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపణలు
  • జోకర్‌గా మారడంటూ విమర్శలు
  • సీఎం రాజీనామా ఇచ్చాకే ఓట్లు అడగాలని డిమాండ్‌

విధాత, హైదరాబాద్ : పంద్రాగ‌స్టు లోపు రుణ‌మాఫీ చేస్తామ‌న్న రేవంత్ రెడ్డి తన. రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వ‌డం లేదని, ఆయ‌న మీద ఆయ‌న‌కే న‌మ్మ‌కం లేదా అని.. ఓట్లు దండుకోవాల‌నే అబద్దపు మాటలు చెప్పారా అని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన కౌశిక్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి కోడికి ఉన్న దిమాక్ కూడా లేదని, హౌవులా ప‌నులు అయినా.. వాహ‌లా ప‌నులు అయినా కోమ‌టిరెడ్డితోనే సాధ్య‌మ‌వుతాయ‌ని విమర్శించారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నిన్న హ‌రీశ్‌రావును విమ‌ర్శించిన తీరు బాగలేదన్నారు. ఆయ‌న మాట్లాడే తీరు, భాష బాగాలేదని, ఏం మాట్లాడుతాడో కూడా ఆయనకే తెల్వ‌దన్నారు. కోమ‌టిరెడ్డికి మంత్రి కాగానే కండకావరం పెరిగిందని, జోకర్‌గా, బ్రోకర్‌గా మాట్లాడుతున్నారని, మంత్రిలాగా మాట్లాడుత‌లేడని, మందు తాగి ప్రెస్ మీట్ పెట్టి హ‌రీశ్‌రావును తిడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలోనే స‌బ్జెక్ట్ లేని స‌న్నాసి కోమ‌టిరెడ్డి అని, ఆయ‌నకంటే జూనియ‌ర్ అయిన రేవంత్ రెడ్డి కింద ప‌ని చేయ‌డం సిగ్గు అనిపిస్త‌లేదా అని ఎద్దేవా చేశారు.కోమ‌టిరెడ్డిని మెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చేర్పించాలని, ఆయ‌న మాన‌సిక ప‌రిస్థితి బాగాలేదన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కుట్ర చేశార‌ని, త‌న వ‌ద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే విష‌య‌మై బీఆరెస్‌ అధిష్టానంతో మాట్లాడాల‌ని కోమ‌టిరెడ్డి త‌న వ‌ద్ద‌కు రాయబారం పంపార‌ని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. కోమ‌టిరెడ్డి ఒక మ‌నిషిని నా ద‌గ్గ‌రికి పంపించిండని, 22 మంది ఎమ్మెల్యేల‌ల మ‌ద్ద‌తు ఉందని, గ‌వ‌ర్న‌మెంట్ ప‌డ‌గొడుదామని, నేనే ముఖ్య‌మంత్రి అయితా అని, అందుకు బీఆరెస్‌ మ‌ద్ద‌తు కావాల‌ని నా వ‌ద్దకు పంపించిండని, కానీ నేను కోమ‌టిరెడ్డిని న‌మ్మ‌లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్‌రావులకు కూడా ఆ విషయం చెప్ప‌లేదని, కోమ‌టిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెల్వని వ్యక్తి అని, ఆయన మాటలపై న‌మ్మ‌కం లేక వాటిని పట్టించుకోలేదన్నారు. రూమ్ లోప‌ల ఒక‌టి, రూమ్ బ‌య‌ట ఒక‌టి మాట్లాడుతాడని, మిమ్మ‌ల్ని ప్ర‌శ్నించ‌మ‌ని ప్ర‌జ‌లు మాకు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చారని కోమటిరెడ్డికి సమాధానమిచ్చానని చెప్పారు.

రాజీనామా చేశాకే ఓట్లు అడగాలి
రేవంత్ మీద న‌మ్మ‌కం లేక‌నే హ‌రీశ్ స‌వాల్ విసిరిండని, రేవంత్‌ను న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేరని, ఆరు గ్యారెంటీలు అమ‌లు చేశానని అసెంబ్లీలో, ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఇది అబ‌ద్దమన్నారు. క‌ర్ర కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ హామీల‌న్నీ అమ‌లు అవుతాయన్నారు కౌశిక్ రెడ్డి. తాను మంత్రి కోమటిరెడ్డికి సవాల్ చేస్తున్నానని, మీరు ఏ ఫార్మాట్‌లో అడిగితే ఆ ఫార్మాట్‌లో హ‌రీశ్‌రావుతో రాజీనామా చేయిస్తానని.. ఆ బాధ్య‌త నాదని, మ‌రి నువ్వు రేవంత్ రెడ్డిని కూడా అదే ఫార్మాట్‌లో రాజీనామా చేయించే బాధ్య‌త తీసుకుంటావా..? అని సవాల్ చేశారు. సీఎం రాజీనామా లేఖ‌ను ఇచ్చిన త‌ర్వాత‌నే ఓట్లు అడ‌గాలని డిమాండ్ చేశారు. రేవంత్ మాట‌లు విని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోసపోయారని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూడా ప్రజలు మోస‌పోవద్దని పాడి కౌశిక్ రెడ్డి కోరారు.

Latest News