MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

  • Publish Date - May 27, 2024 / 04:18 PM IST

విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టగా, కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. సీబీఐ తరపున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లను ఈడీ, సీబీఐ దాఖలు చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా పడింది.

కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. మహిళలను విచారించే విషయంలో కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు.

కాగా.. తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41(ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. సీఆర్సీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, తర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం ఆమెను అరెస్టు చేసిందని తెలిపారు.

ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న ఆమెపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళ హక్కులను కాలరాసే విధంగా దర్యాప్త సంస్థలు వ్యవహరించాయని, మొబైల్ పోన్లు, డిజిటల్ ఆధారాలను ద్వంసం చేశాయని ఆరోపించారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు.

ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని జడ్జి మెచ్చుకున్నారు. అయితే, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరపు న్యాయవాది గడువు కోరారు. మంగళవారం తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు భౌతికంగా హాజరై వాదనలు వినిపిస్తామన్నారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.

Latest News