Site icon vidhaatha

MLC Kavitha | కవిత మళ్లీ నిరాశే.. జూన్‌ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు

ఈడీ కేసులోనూ కస్టడీ పొడిగింపు

విధాత: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పెరిగింది. జూన్‌ 3 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి జడేజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్‌ గడువు నిన్నటితో ముగిసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె కస్టడీలో ఉండగా కోర్టులో హాజరుపరిచారు. ఆమె రిమాండ్‌ పేపొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు జూన్ 3వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈడీ కేసులోనూ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఈడీ కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ పై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్‌, ప్రిన్స్‌ కుమార్‌, అరవింద్‌ సింగ్‌, చరణ్ ప్రీత్‌పై ఛార్జిషీట్‌ దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలు పొందుపరిచామని ఈడీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలని వాదించారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీని జూన్‌ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version