విధాత, హైదరాబాద్ : నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుని లీక్‌లతో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ, మెదక్ బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో శనివారం నిర్వహించిన బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు తప్పుడు లీకులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని పేద విద్యార్థులకు విద్య, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. తాను ఎలాంటి వాడినో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలుసని.. ఓట్ల కోసం నీచరాజకీయాలు చేసే వ్యక్తిని తాను కానని స్పష్టం చేశారు. ఇకనైనా తనపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ఆయుధంగా ఉపయోగించుకుని ఇతర పార్టీ నేతలకు సబంధించిన డబ్బును పట్టుకోరున్నారని, ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును భారీగా తరలించినట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో తేలినట్లుగా వార్తలు వెలువడ్డాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన వెంకట్రామిరెడ్డి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లకు ఓటమి తప్పదని గ్రహించే ట్యాపింగ్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే ట్యాపింగ్ ఆరోపణలు: ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి
