విధాత : ఓ వానరం(monkey) అలసిపోయిందో ఏమోగాని..ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనికి చొరబడి ఉద్యోగి భుజాలపై కూర్చుని తలపై వాలి నిద్రపోయిన ఘటన వైరల్ గా మారింది. ములుగు జిల్లా ఏటూరునాగారం(Eturu nagaram) లోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఉద్యోగులు రోజువారిగా తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఓ కోతి లోపలికి వచ్చింది. వానారాన్ని చూసిన కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది అదెక్కడ తమ మీద దాడి చేస్తుందేమోనని హడలిపోయారు. కానీ ఉద్యోగి మహ్మద్ సాదిక్(Mohammad Sadiq) మాత్రం ఏ మాత్రం జంకకుండా కోతిని చూస్తూ.. ఏం కావాలి? ఏమైనా తిన్నావా? అని అడగడంతో ఆయన దగ్గరకు వెళ్లి భుజాలపైకెక్కింది. ఆయన తలపై వాలిపోయి హాయిగా నిద్రపోయింది.
దీంతో సాదిక్ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు. ఆ తర్వాతా సాదిక్ పెట్టింది తిని మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన సాటి ఉద్యోగులు సాదిక్ కు, ఆ కోతికి మధ్య ఏదో పూర్వ పరిఛయం ఉన్నట్లుగా ఆ కోతి వ్యవహరించడం చూసి ఆశ్చర్యపోయారు.
