దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్ … ప్రాణం పోతున్నా స్పందించని ప్రభుత్వ తీరుపై మండిపాటు

నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్ చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 9 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ కొబ్బరి నీళ్లు సేవించి దీక్ష విరమించారు

  • Publish Date - July 2, 2024 / 02:13 PM IST

విధాత, హైదరాబాద్‌ : నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్ చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం దాదాపు 9 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ కొబ్బరి నీళ్లు సేవించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని.. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క ఉద్యోగం పెరగలేదని అన్నారు. అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నానని.. ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదని, ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదని, మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్‌ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదని ఆరోపించారు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేయాలని, గ్రూపు వన్ ఫోస్టుల భర్తీలో 1:100 శాతం పెంచాలని, గ్రూపు 2, గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలని రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని, అన్ని పార్టీల వారినీ కలుపుకుని పోతామని చెప్పారు. నాకు మద్దతు తెలిపిన బీఆరెస్‌ నాయకులకు, మీడియా, సోషల్‌ మీడియాకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Latest News