Pregnant Woman carried in Flood |విధాత: అటవీ ప్రాంతాల్లో నివసించే అదివాసీలు విద్య, వైద్యం కోసం పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా వర్షకాలంలో వారి కష్టాలు మరింత అధికంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ములుగు జిల్లాలో ఏజెన్సీ వాసుల కష్టాలు కూడా పెరిగాయి. ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఓ గర్బణిని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేతుల మీద ఎత్తుకుని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమకు ఇంకెన్నాళ్లీ కష్టాలు అంటూ ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి కృష్ణవేణి అనే గర్భిణికి గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. అక్కడికి చేరుకోవాలంటే అల్లిగూడెం- నర్సాపూర్ మార్గమధ్యలో ఉన్న కిన్నెరసాని వాగు దాటాల్సిందే. గర్బిణీకి అత్యవసర వైద్యం అవసరం కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగులో ఆ మహిళను భుజాలపై మోసుకుంటూ వెళ్లి వాగు దాటించారు.
ములుగు ఏజెన్సీ ఏరియాలో జంపన్న వాగు, జలగవంచ వాగు, కిన్నెరసాని వాగు, గుండ్లవాగు, రాళ్లవాగు సహా పలు వాగులు వరద ఉదృతిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు, ప్రధాన రహదారులకు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.