విధాత : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ తరచూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణలు..ఇతర కారణాల నేపథ్యంలో మంత్రి పదవి ఆయనను ఊరిస్తూ వస్తుంది. మంత్రి పదవి జపాన్ని రాజగోపాల్ రెడ్డి వదిలేసినా…ఆయన అనుచరులు మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా చండూరులో కార్యకర్తలు పెద్దఎత్తున సమావేశమయ్యారు. మంత్రి రాజన్న అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ‘మంత్రి రాజన్న.. కేఆర్ జీఆర్ ఆర్మీ అంటూ జెండాలు ఏర్పాటు చేశారు. జెండాలలో మంత్రి రాజన్న అంటూ ముద్రించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆకాంక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి పదవి సాధనలో రాజగోపాల్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఆయన వెంట నడుస్తామని తెలిపారు. అయితే మంత్రి కాకముందే మంత్రి రాజన్న అంటూ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాలు చూసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.