వలస ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలోకి నో ఛాన్స్ … జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో పునరాలోచన

మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల ఆశలు ఆవిరైనట్లేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన వారికే కేబినెట్ లో చోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మంత్రివర్గంలో చోటు ఆశించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు సమాచారం.

  • Publish Date - June 29, 2024 / 07:59 PM IST

తాజా ఊహాగానాలకు సీఎం రేవంత్ చెక్

సీఎం ప్రకటనతో రాజకీయవర్గాల్లో చర్చ

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో తీవ్ర నిరాశ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒకింత ఆనందం

విధాత ప్రత్యేక ప్రతినిధి:మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల ఆశలు ఆవిరైనట్లేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన వారికే కేబినెట్ లో చోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మంత్రివర్గంలో చోటు ఆశించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు సమాచారం.

తాజా ఊహాగానాలకు సీఎం చెక్

ఇప్పటికే బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఇందులో సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవులు ఆశించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో వారి ఆశలు గల్లంతయ్యాయి. వీరికి మంత్రి వర్గంలోకి చేరే దారులు మూసుకుపోయాయి.బీఆరెఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం ఆయన కూతురుకు ఎంపీ టికెట్ తోపాటు, మంత్రి పదవి హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. అదే విధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి, కుమారుడికి ఉన్నత స్థాయి పదవి ఆశించినట్లు ప్రచారం జరిగింది. దానం నాగేందర్ ఇప్పటికే ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించినట్లు చర్చ జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి సైతం వీరికి రాజకీయాల్లో అపార అనుభవం ఉందని, సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో వీరికి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని భావించారు. కానీ తాజాగా సీఎం ప్రకటనతో దారులు మూసుకుపోయ

కాంగ్రెస్ అధిష్టానం గట్టి నిర్ణయం?

శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ తో కాంగ్రెస్‌ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్‌ విస్తరణలో స్థానం లభిస్తుందని తేల్చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారికే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కూడా ఇదే విధానంతో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో తమ పార్టీ నుంచి బీఆరెఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈసారి తమ పార్టీలో చేరే వారికి ఇతరత్రా స్థానాలు కేటాయించాలని మంత్రివర్గంలో మాత్రం అవకాశం కల్పిస్తే విమర్శలకు తావిచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. పైగా సొంత పార్టీలో కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించిన నేతలు ఆవేదనకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో పునరాలోచన

తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీలో చేరిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఒక దశలో ఆయన పార్టీని వీడుతారనే చర్చ జరిగింది. పార్టీలో కొనసాగుతానని చెప్పినప్పటికీ ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని భావించిన అధిష్టానం హుటాహుటిన ఆయనతో సంప్రదింపులు జరిపారు. చివరికి ఢిల్లీ స్థాయిలో బుజ్జగింపులు చేపట్టిన తర్వాత కానీ జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రానున్న రోజుల్లో పార్టీలోని ఇతర ప్రాంతాల్లోని నేతలు కూడా ఈ విధంగా స్పందించే అవకాశం మరోసారి ఇవ్వకూడదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రభుత్వం తమ చేతుల్లోనే ఉన్నందున పార్టీలో చేరే ఎమ్మెల్యేలకు ఇతరత్రా ఉన్నత స్థాయి పదవులతో గౌరవించాలని, మంత్రివర్గంలో మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకూడదని ఆలోచనతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణం తోటే సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని స్పష్టం చేసినట్లు భావిస్తున్నారు. ఇదే మాట మీద కట్టుబడి ఉంటారా లేదా ప్రత్యేక మినహాయింపు పేరుతో ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? అనేది రానున్న రోజుల్లో తేలేనుంది.

 

Latest News