విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు 8రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సంతాప తీర్మానం పిదప సమావేశాలను బుధవారానికి స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ చాంబర్‌లో బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు, బీఆరెస్ నుంచి మాజీ మంత్రి టి.హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. సమావేశాలను 8రోజుల పాటు ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం రైతు రుణమాఫీపై చర్చ, 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే రోజు ఉదయమే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి చదివి వినిపిస్తారు.
T.G Assembly | ఈనెల 31వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు … బుధవారం రైతు రుణమాఫీపై చర్చ
