Site icon vidhaatha

Pension Akrosh March । ఓపీఎస్‌ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి : ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ

Pension Akrosh March । ఏకీకృత పెన్షన్‌ విధానం (యూపీఎస్‌)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 400 పైగా జిల్లాల్లో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం ఆధ్వర్యంలో పెన్షన్‌ ఆక్రోష్‌ మార్చ్‌ (Pension Akrosh March) పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోనూ 33 జిల్లా  కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్‌పీఎస్‌/ యూపీఎస్‌ (UPS) విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బీమా భవన్ (Bima Bhavan) వద్ద జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎంఓపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో నెలసరి జీతం నుంచి 10 శాతాన్ని, అదేవిధంగా  ప్రభుత్వం వాటా 18.5%  మొత్తం  28.5% ఎన్.పీ.ఎస్ ట్రస్ట్‌కు జమచేయాల్సి ఉంటుందని అన్నారు. ఉద్యోగి రిటైర్ అయినప్పుడు తన ప్రాన్ PRAN అకౌంట్లో జమ కూడిన మొత్తాన్ని ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ సరెండర్ చేస్తేనే, తర్వాత తనకు 48-50 శాతం బేసిక్‌తో  కూడిన పెన్షన్ లభిస్తుందని చెప్పారు.

ఉద్యోగి తన సామాజిక భద్రతను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ యూపీఎస్‌ విధానం వల్ల ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగి తన యవ్వనాన్ని మొత్తం ధారపోసే ఉద్యోగ జీవితం మొత్తాన్నీ ప్రజా సేవ రంగానికి ఉపయోగిస్తే, కుటుంబానికి పెన్షన్ తో సామాజిక భద్రత (social security) ఇవ్వాల్సిన ప్రభుత్వం, పెన్షన్ కొనుక్కునే విధంగా తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఎస్‌ విధానానికి మూలమైన సోమనాథన్ కమిటీ (Somanathan Committee) రిపోర్టును బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఈ రిపోర్టును ఉంచాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్‌టీఐ ద్వారా కమిటీ రిపోర్ట్ అడగగా, సమాధానంగా బహిరంగపరచలేమని సమాధానం ఇవ్వడం ఉద్యోగులు, ఉపాధ్యాయులనీ విస్మయానికి గురిచేసిందని స్థితప్రజ్ఞ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్‌ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సందీప్, రెడ్డప్ప, మదన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version