Sunny Leone
విధాత: కవితకు కాదేది అనర్హం అన్న చందాన మోసానికి కాదెవరు అడ్డం అన్న నానుడిని గుర్తుకు తెచ్చింది ఇటీవల ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన. ఇప్పుడు ఈ వార్త విన్నవారంతా, చదివిన వారంతా ఇప్పటికే అశ్చర్య పోవడం మాత్రమే మిగిలింది. గతంలో మనం హీరో,హీరోయిన్ల పేరు మీద ఆధార్, ఓటర్ కార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్త వాటినన్నింటిని మించింది.
విషయానికి వస్తే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళలకు పెన్షన్ అందించేందుకు మహాతరి వందన్ యోజన పథకాన్ని తీసుకొచ్చి వారికి ప్రతి నెలా రూ.1000 అందజేస్తోంది. అయితే రీసెంట్‌గా లబ్దిదారుల ఖాతాలు పరిశీలిస్తుండగా అందులో బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లియోని (Sunny Leone) పేరు ఉండడం చూసి జిల్లా కలెక్టర్ హరీస్ ఎస్, మహిళా,శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఖంగు తిన్నారు.
తీరా ఎంక్వైరీ చేస్తే బస్తర్‌కు చెందిన వీరేంద్ర జోషి తన పేరు సన్నీలియోన్ అని, అమెరికన్ నటుడు జానీ సిన్స్ భర్తగా పేర్కొంటూ ఓ అంగన్‌వాడీ వర్కర్ పేరు,పేపర్లు ఉపయోగించి ఈ స్కీమ్ కింద 10 నెలలుగా ప్రయోజనం పొందుతున్నాడని తేల్చారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు. ఆపై ప్రభుత్వాన్ని మోసగించినందుకు వీరేంద్ర జోషిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.