బీజేపీ మతోన్మాద ఫాసిస్టు పద్మవ్యూహాన్ని బద్దలు కొడుదాం
-ప్రగతిశీల సమాజ నిర్మాణానికి పోరాడుదాం
సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
-ఖమ్మంలో ప్రారంభమైన పీడీఎస్ యూ రాష్ట్ర 23వ మహాసభ
పట్టణంలో భారీ విద్యార్థి ర్యాలీ, బహిరంగ సభ
విధాత, ప్రత్యేక ప్రతినిధి: నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆర్ ఎస్ ఎస్ సంఘ్ పరివార్ శక్తులు కలిసి దేశానికి బిగిస్తున్న కుల మతోన్మాద ఫాసిస్ట్ పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత విద్యార్థి, యువతపైనే ఉన్నదని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పి డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్ మీదుగా భక్త రామదాసు కళక్షేత్రం వరకు భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది విద్యార్థులు బిగి పిడికిలి జెండాలు చేతబట్టి, జీనా హైతో మర్ నా సిఖో-కదం ఫర్ లడ్ నా సికో అని గర్జిస్తూ ఖమ్మం పట్టణ వీధుల్లో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృథ్వి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, పి.డి.ఎస్.యు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల అశోక్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ సాయిబోలా లు మాట్లాడారు.
ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను తన గుప్పిట్లోకి తీసుకొని ప్రజాస్వామిక వాదులను,ప్రశ్నించే గొంతులను, దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 79 సంవత్సరాల పాలనలో ప్రభుత్వాలు పార్లమెంట్, అసెంబ్లీలో చేసిన చట్టాలు, తీసుకువచ్చిన సంస్కరణలు పేద, మధ్యతరగతి వర్గాలకు నేటికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్య, వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రశ్నించే గొంతులను అర్బన్ నక్సల్స్ అనే ముద్ర వేసి, జైలు పాలు చేస్తూ, చిత్రహింసలు పెడుతూ, చివరికి ఆపరేషన్ కగార్ పేరిట అమాయక ,ఆదివాసి గిరిజనులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో మతం ముసుగులో స్త్రీలపై దాడులు, అత్యాచారాలు చేసిన వారిని, బ్యాంకులను కొల్లగొట్టి ప్రజల డబ్బుతో విదేశాలకు పారిపోయిన బడా బాబులకు బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పించడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం- 2020 ను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండానే తీసుకువచ్చి భారతీయ విద్యా రంగాన్ని పూర్తిగా కాషాయకరిస్తూ భావి భారత పౌరులను కుల, మతోన్మాదులుగా మార్చే కుట్రలకు పాల్పడుతోందన్నారు.
ప్రపంచ దేశాలు అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే భారత విద్యార్థి ,యువత శక్తి యుక్తులను నిర్వీర్యం చేస్తూ, దేశంలో బ్రాహ్మణీయ మనువాద తిరోగమన విధానాలను పున ప్రతిష్టించే చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. నేటి విద్యార్థి ,యువత సమాజంలో పాలకులు తీసుకు వస్తున్న దేశ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రగతిశీల సమాజాన్ని స్థాపించుకోవాలని , ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, ఎర్ర అఖిల్ కుమార్, నరేందర్, గణేష్, సహాయ కార్యదర్శి సాయి,సురేష్, వి.వెంకటేష్, రాకేష్, కోశాధికారి మహేందర్, జే.ఎన్.యు.ఢీల్లీ పి.డి.ఎస్.యు. విద్యార్థినేత తిరుపతి,ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు అంగడి కుమార్, మునిగేల శివ ప్రశాంత్, బి.అజయ్, వి.కావ్య,పి.అనూష, దీక్షిత, సీతారాం, నాగరాజు, సాయి, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య కళాకారుల విప్లవ గేయాలు, కళారూపాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
