Lover in Box | ఓ యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉండాలనుకుంది. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ప్రియుడ్ని ఏకంగా ఇంటికే పిలిపించుకుంది. సరదాగా లవర్‌తో గడుపుదామనుకునే సమయానికి.. అత్త ఎంటరై ఆగమాగం చేసింది. దాంతో ప్రియుడిని ఎవరి కంట పడకుండా.. 45 నిమిషాల పాటు ట్రంకు పెట్టెలో దాచి పెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం యువతి కుటుంబ సభ్యులందరూ తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన ఆమె.. తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.
ప్రేమికులిద్దరూ ఓ గదిలో ముద్దులు, ముచ్చట్లలో మునిగిపోయారు. వీరి గుసగుసలు పక్కింట్లో ఉన్న అత్తకు వినిపించాయి. దీంతో అత్త.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. ఏదో జరుగుతుందని భావించిన యువతి.. తన ప్రియుడిని ట్రంకు పెట్టెలో దాచి పెట్టింది. ఇంట్లో ఎవరో ఉన్నారని అత్త, కుటుంబ సభ్యులు అడగ్గా.. ఇంటికి ఎవరూ రాలేదని ఆమె సమాధానం దాటవేసింది. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు.
ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇల్లంత గాలించారు. కానీ వ్యక్తి లభించలేదు. అంతలోనే ట్రంకు పెట్టేలో నుంచి శబ్దాలు రావడంతో.. పోలీసులకు దానిపై కన్నుపడింది. ట్రంకు పెట్టెను ఓపెన్ చేసేందుకు యువతి మొదట నిరాకరించినప్పటికీ, చేసేదేమీ లేక పెట్టెను తెరిచింది. దాంట్లో దాగిఉన్న ప్రియుడు.. తీవ్ర ఆయాసంతో బయటకు వచ్చాడు. అతనికి చెమటలు పట్టాయి. ఇక ప్రేమికులద్దరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
