Sobitha | టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి శోభితా ధూళిపాళ, అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత మరింతగా వార్తల్లో నిలుస్తోంది. నటిగా ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలతో ప్రశంసలు అందుకున్న శోభితా, తాజాగా ఆమె నటించిన మర్డర్ థ్రిల్లర్ చిత్రం ‘చీకటిలో’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. ఓటీటీలో మంచి స్పందన రావడంతో ఈ సినిమా శోభితాకు తెలుగులో మరో హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా తన అభిప్రాయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా ఆమెకు ఇష్టమైన తెలుగు సినిమా ఏదని విలేకరులు ప్రశ్నించగా, ఎలాంటి ఆలోచన లేకుండా ‘ఆనంద్’ అని సమాధానం ఇచ్చింది శోభితా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్లాసిక్ తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా అని చెప్పింది. 2004లో విడుదలైన ‘ఆనంద్’లో కథనం, సహజమైన పాత్రలు, సున్నితమైన భావోద్వేగాలు ఎంతో అందంగా చూపించారని ఆమె అభిప్రాయపడింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు కూడా ఆ పాత్రలతో పాటు ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని పేర్కొంది. నాగ చైతన్య సినిమా పేరే చెబుతుందని చాలామంది ఊహించినా, తనకు నిజంగా నచ్చిన సినిమానే చెప్పడం ద్వారా శోభితా మరోసారి తన నిజాయితీని చూపించింది.
ఇంటర్వ్యూలో తన భర్త నాగ చైతన్య గురించి కూడా శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా సపోర్టివ్ పర్సన్ అని, ఇద్దరం సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకుంటామని చెప్పింది. అయితే కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు మాత్రం ఎవరి వాటిని వారు స్వతంత్రంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. తాను ఒక సినిమా ఒప్పుకునే ముందు కథ బలం, పాత్రకు ఉన్న ప్రాధాన్యతకే మొదటి స్థానం ఇస్తానని తెలిపింది. నాగ చైతన్యను కేవలం సలహాల వరకే అడుగుతానని, ఫైనల్ డిసిషన్ మాత్రం తానే తీసుకుంటానని శోభితా చెప్పింది.అలాగే తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ, లాక్‌డౌన్ సమయంలో తన తల్లి సినిమాలు వదిలేసి గేట్ పరీక్ష రాసి చదువుపై దృష్టి పెట్టమని సూచించిందని వెల్లడించింది. కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో వారు ఆలా ఆలోచించారని వివరించింది. అయినప్పటికీ తాను సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని, ఆ విషయంలో తల్లిదండ్రులు చివరకు పూర్తి మద్దతు ఇచ్చారని చెప్పింది.
