Site icon vidhaatha

అహంకార నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నికల ఫలితాలపై … ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్‌ : ఏపీ అసెంబ్లీ, తెలంగాణ సహా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించి అహంకార నేతలకు గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీకి భారీగా సీట్లు తగ్గించి, తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్‌ను ఓడించడం ద్వారా ప్రజలు అహంకారంతో విర్రవీగే నేతలకు బుద్ది చెప్పారన్నారు.

ప్రజలను, పార్టీ నేతలను సైతం కలవకుండా నియంతృత్వ రాజకీయాలు సాగించిన కేసీఆర్‌, జగన్‌లు ఇద్దరి వ్యవహారశైలిని, పాలనా విధానాలను గమనించిన ప్రజలు సంక్షేమ పథకాలకు అతీతంగా ఆలోచించి చైతన్యంతో ఓడించారన్నారు. కేంద్రంలో మోదీకి సైతం ఆదరణ తగ్గిందని, దానికి ఎన్డీయే కూటమి తగ్గిన సీట్లే నిదర్శనమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి గెలవాల‌ని చూసిందని ఆరోపించారు. ప్రజలు మాత్రం అన్ని గమనించే తీర్పునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో మంచి ఫలితాలే వచ్చాయన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ మంచి మెజార్టీతో గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Exit mobile version