- వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
- పలు పనులకు పరిపాలనా అనుమతులు
- త్వరలో అభివృద్ధి పనులకు టెండర్లు
- నగరానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
- సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క
విధాత, ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, దీని కోసం చేపట్టనున్న పనుల కోసం ఈ నెలలోనే టెండర్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై హన్మకొండలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు.
అభివృద్ధి పనుల కోసం టెండర్లు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు నిర్వహిస్తున్నట్లు సమీక్షా సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి, సీతక్కలు మీడియాకు వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మొదటి దశ స్ట్రెచ్ పనుల భూసేకరణ పూర్తి కావడం జరిగిందని, రెండవ దశ స్ట్రెచ్ పనులను రూ.305 కోట్ల తో చేపట్టే భూసేకరణకు త్వరగా టెండర్ ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి మాడ వీధుల పనులను రూ.30 కోట్ల తో చేపడుతున్నామని తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ ను పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు.
వరంగల్ ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజ్ సిస్టం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినప్పుడు 4వేల కోట్ల పైచిలుకు పరిపాలనపరమైన అనుమతులను ఇచ్చినట్లు చెప్పారు. వర్షాకాలంలో వరదలు ఎక్కడైతే ఎక్కువగా వచ్చాయో ఆ ప్రాంతంలో భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను మొదటి దశలో రాబోయే వారం రోజుల్లో టెండర్లను పిలుస్తామన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీటి కోసం సుమారు 570 కోట్ల రూపాయలకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కొంత మిగిలి ఉందని, వాటి పనులను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో వదిలేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కూడా వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవుతుందని దానిని కూడా రివైజ్డ్ చేసేందుకు క్షుణ్ణంగా సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం ఉమ్మడి వరంగల్ లో అభివృద్ధిలో ముందంజలో ఉండబోతుందన్నారు. క్రికెట్ స్టేడియం తో పాటు స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు( డిపిఆర్)ను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా.. మహా అద్భుతంగా రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే 95 శాతం ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు తెలిపారు. మేడారం జాతర ఈనెల 28 నుండి 31 వ తేదీల వరకు జరుగుతుందని చెప్పారు. అమ్మవార్లు ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరణ పనులలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 250 నుండి 300 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అద్భుతంగా పనులను పూర్తి చేశామన్నారు. 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
ఈ సమీక్ష సమావేశంలో లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య,నగర మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ పిడి విపి.గౌతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని కలెక్టర్లు స్నేహ శబరిష్, డాక్టర్ సత్య శారద, రాహుల్, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
వరంగల్ సమీక్ష సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరీ
రోడ్లపై పరుగులు తీసే 5స్టార్ హోటల్.. లంబోర్ఘిని డబుల్ డెకర్ మోటర్‌హోమ్.. విశేషాలివి!!
