power purchase । గత ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు (power purchase) నిమిత్తం గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.261 కోట్లు రాష్ట్ర విద్యుత్తు సంస్థల నెత్తిన మరో గుదిబండను పెట్టాయి. ఈ మేరకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చేసిన ఫిర్యాదుతో తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో (electricity bids) పాల్గొనకుండా నేషనల్ నోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నది. ఫలితంగా గురువారం ఉదయం నుంచి విద్యుత్తు కొనుగోలు బిడ్లు వేయకుండా పవర్ ఎక్సేంజ్‌లు తెలంగాణ డిస్కంలను నిలిపివేశాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాకమేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు గత ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (PowerGrid Corporation) తో విద్యుత్తు సరఫరాకు కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అవసరం లేకున్నా.. గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుందని, కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా.. అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు అడ్వాన్సు కారిడార్ (corridor) బుక్ చేసిందని అంటున్నారు. అయితే.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) విద్యుత్తు లభించే అవకాశొం లేదని ఈ కారిడార్‌ను అర్ధాంతరంగా నాటి ప్రభుత్వం రద్దు చేసుకుంది. అయితే.. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాడినా వాడకున్నా.. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందం చేసుకోవటంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Central Electricity Regulatory Commission)ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.
కేసీఆర్ ప్రభుత్వ హయంలో విద్యుత్తు కొనుగోళ్ల కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ విషయంలో విచారణ జరిపినప్పుడు హాజరైన విద్యుత్తు జేసీ చైర్మన్ రఘు సైతం 2600 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు సరఫరా చేయలేదన్న రఘు.. 1000 మెగావాట్ల సరఫరాకు ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు జరిగితే అది సరఫరా చేయలేదని తెలిపారు. తర్వాత మరో 1000 అదనపు వెయ్యి మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారని, జరిగిన తప్పు తెలుసుకొని రద్దు చేసుకోవాలంటే కుదరలేదని పేర్కొన్నారు.