Site icon vidhaatha

వర్ధన్నపేట ఎమ్మెల్యేపై ప్రజాగ్రహం.. దమ్మన్నపేటలో రమేష్‌కు నిరసన సెగ

పథకాల అమలులో పక్షపాత ధోరణి అంటూ నిలదీత

విధాత, వ‌రంగ‌ల్ ప్రత్యేక ప్రతినిధి: వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌ పై ద‌మ్న‌న్న‌పేట గ్రామ‌స్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల నుంచి తీవ్ర నిర‌స‌న ఎదురైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులను కాదని తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఊర్లోకి రాకుండా అడ్డు తగిలారు. పోలీసులు వారించినా ససేమిరా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.



గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే అరూరి రమేష్ పై ప్రజలు తిరగబడ్డారు. ద‌ళిత‌బంధు, గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కాల‌తోపాటు ఇత‌ర సంక్షేమ పథ‌కాల్లో కేవ‌లం బీఆర్ఎస్ లోని కొంత‌మంది లీడ‌ర్ల‌కే ల‌బ్ధి చేకూరుస్తున్నార‌ని, మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లంలోని ద‌మ్మ‌న్న‌పేట గ్రామ‌స్థులు నిల‌దీశారు.

పథకాల్లో పక్షపాతం

పథకాల అమలులో పక్షపాతం వహించారని గ్రామస్థులు ఎమ్మెల్యే తీరును విమర్శించారు. దళిత బంధు విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యేను స్థానిక దళితులు అడ్డుకున్నారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ కొట్లాడితేనే వచ్చింది కాదు, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలు, యువకులు ముందుకొచ్చి ఎమ్మెల్యే తప్పొప్పులను, హామీలని నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు.


ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని గ్రామస్థులు


పోలీసుల ర‌క్ష‌ణ న‌డుమ ప్ర‌చార ర‌థంపైకి చేరుకుని గ్రామ‌స్థుల‌కు ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా నిర‌స‌న‌లు మాత్రం చ‌ల్లార‌లేదు. ద‌ళిత‌బంధు ప‌థ‌కం కేవ‌లం బీఆర్ఎస్‌ లోని కొంత‌మంది లీడ‌ర్ల‌కు మాత్ర‌మే వ‌చ్చాయంటూ ప్ర‌చార ర‌థంపైకి చేరుకుని మ‌రీ ఎమ్మెల్యేను మ‌హిళ నిల‌దీసింది. ఎమ్మెల్యే ఇచ్చిన వివ‌ర‌ణ‌కు గ్రామ‌స్థులు ఏమాత్రం సంతృప్తి చెంద‌లేదు. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.


చేసేదేం లేక ప్ర‌చారాన్ని, గ్రామంలో ప‌ర్య‌ట‌న‌ను త్వ‌ర‌గా ముగించుకున్న ఎమ్మెల్యే బ‌య‌ట‌ప‌డ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయ‌డంతో బీఆర్ ఎస్ నేత‌లు గ్రామ‌స్థుల‌పై తోపులాట‌కు దిగ‌డంతో కొంత ఉద్రిక్త‌త నెల‌కొంది. ప‌థ‌కాలు రాకుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌వ‌ద్దంటూ గ్రామ‌స్థులు బీఆర్ఎస్ నేత‌ల‌పై మండిప‌డ్డారు. బీఆర్ఎస్ అనుకూల‌, ఎమ్మెల్యేకు గ్రామ‌స్థుల వ్య‌తిరేక నినాదాల‌తో హోరెత్తింది.

Exit mobile version