Site icon vidhaatha

CM Revanth Reddy | అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌.. వారి కోరిక మేరకే గ్రూప్ 2 వాయిదా

జూన్ 2లోగా నోటిఫికేషన్.. డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత
మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ప్రజాభావన్‌లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సివిల్స్ అభ్యర్ధులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నామని, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్ధులు కచ్చితంగా జాబ్ సాధించి మన రాష్ట్రానికే రావాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు మన వారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని, టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించామని గుర్తు చేశారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం మంచిదికాదని, అభ్యర్ధుల సమస్యలను అర్ధం చేసుకుని గ్రూప్-2ను వాయిదా వేశామని స్పష్టం చేశారు.

ఇక నుంచి ప్రతీ ఏటా మార్చి నెలలోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని, జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, యువత త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామని, వెంటవెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు.

గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని, పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని, నోటిఫికేషన్ ఇచ్చి సమయానికి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు గత పదేళ్లలో లేవన్నారు. అందుకు కారణమేదైనా యువత ఉజ్వల భవిష్యత్ ఆగమైందని, దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదానికంటే, పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్లాడేందుకే వారి సమయం వృథా అయ్యిందని పేర్కోన్నారు. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం వంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు తెలిపారు.

Exit mobile version