Telangana Ration Shops : అక్టోబర్ 1 నుండి రేషన్ షాపులు బంద్

అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో రేషన్ షాపులు మూతపడనున్నాయి. బకాయిలు చెల్లించకపోతే రేషన్ డీలర్లు సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరిక.

Ration Shops

విధాత, హైదరాబాద్ : రూ.8వేల కోట్లుకు పైగా ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిల పంచాయితీని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో చర్చల ద్వారా పరిష్కరించుకుని కాలేజీల నిర్వహణ కొనసాగేలా కష్టపడిన తెలంగాణ ప్రభుత్వానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యాయి. రూ.1400కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం 303ప్రైవేటు ఆసుపత్రులు మంగళవారం అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి.

ఇది చాలదన్నట్లుగా ఆక్టోబర్ 1నుంచి రేషన్ డీలర్లు సమ్మె చేపట్టాలని నిర్ణయించడంతో రేషన్ దుకాణాలు మూత పడే పరిస్థితి ఎదురవ్వనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్ల సమ్మె బాట పట్టబోతున్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్ల అసోసియేషన్ సమ్మె నోటీసులు ఇచ్చింది. డిమాండ్లు ఆమోదించని పక్షంలో వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ప్రకటించింది.