Nita Ambani | బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma Temple ), పోచమ్మ ఆలయానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ( Mukesh Ambani ) సతీమణి నీతా అంబానీ( Nita Ambani ) భారీ విరాళం ఇచ్చారు. నీతా అంబానీ ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన కూడా నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ ఎల్లమ్మ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో కృష్ణ ఆలయం యొక్క విశిష్టతను వారికి తెలియజేసి.. అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీంతో నీతా అంబానీ రూ. కోటి విరాళాన్ని ఎల్లమ్మ ఆలయానికి అందించారు. ఈ నగదు ఆలయం ఖాతాలో బుధవారం జమ అయినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగించనున్నామని ఆలయ ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ తెలిపారు.
ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ మహోత్సవం, రథోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే సమీక్షించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాలంటీర్లకు ఫొటో గుర్తింపు కార్డులు, అలాగే దాతలు, ముఖ్యమైన వారికి ప్రత్యేక పాస్లు అందించాలని ఆదేశించారు.