హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత): రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్పు, తదితర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని , రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతుల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుందని ఆదివారం ఓ ప్రకటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో ఈ రోడ్డుకు 100 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. దీనికోసం భూములు తీసుకుంటామని ప్రకటించారు. అట్లాగే రైల్వే ట్రాక్ కొరకు మరొక 40 అడుగులవెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నది. ఇంతకు ముందు మొదటి అలైన్‌మెంట్ తయారుచేశారు. తర్వాత దాన్ని మార్చి రెండవసారి అలైన్‌మెంట్ చేశారు. ఇప్పుడు మూడో అలైన్‌మెంట్‌ను తయారుచేసి విడుదల చేశారు. ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి వున్న వారి భూముల్లోకి రోడ్డు మార్గం లేకుండా ఎకరం, రెండెకరాలు, మూడెకరాలున్న చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్ రోడ్డుకోసం తీసుకుంటున్నట్లుగా పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయన్నారు.
ఈ భూములను నమ్ముకునే బ్రతుకుతున్నామని, మరో అవకాశం లేదని, భూములు ఇవ్వడానికి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రింగ్‌రోడ్డు అలైన్‌మెంటును ఎందుకు మార్చుతున్నదో స్పష్టత నివ్వాలి. కేవలం కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసం సామాన్యమైన చిన్నరైతుల జీవితాలను దెబ్బతీసేటువంటి వైఖరిని సిపిఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్ భూబాధితుల సమస్యలపై సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో ఆయా జిల్లాల, మండలాల బాధ్యులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని జాన్ వెస్లీ తెలిపారు.