Bandh for Justice | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల( BC Reservations ) కోసం రాష్ట్రంలోని బీసీ సంఘాలు తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ ఫర్ జస్టిస్( Bandh for Justice )కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు( Political Parties ) మద్దతు పలికాయి. ఈ బంద్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌తో సహా.. బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచే ఆయా పార్టీల నేతలు బంద్‌లో పాల్గొంటున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా ఆందోళన చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.
ఇక హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లుండి దీపావళి పండుగ నేపథ్యంలో తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లేక బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు.
ఇవాళ్టి బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.