Egg | ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయ( Vegetable ) కొందామన్న కేజీ వంద రూపాయాలకు తక్కువ లేదు. ఏ కూరగాయను ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. చివరకు ఆకుకూరలు కూడా ఖరీదైపోయాయి. పోని కోడిగుడ్డు( Egg ) తిందామంటే కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోడిగుడ్డు ధర రూ. 7కు చేరడంతో ప్రజలనే కాదు ప్రోటీన్ ప్రియులను( Protein Lovers ) ఆందోళనకు గురి చేస్తుంది. సాధారణంగా గుడ్లు సాధారణ ప్రజల ఆహారంలో భాగంగా ఉండే ప్రోటీన్. కానీ ధరలు ఇలా పెరగడంతో దిగువ మధ్య తరగతి కుటుంబాలు గుడ్లను కొనుగోలు చేయడం ఎంతో కష్టంగా మారింది. అటు కూరగాయల ధరలు భారీగా పెరగడం.. కోడిగుడ్డు ధరలు కొండెక్కడంతో సామాన్యులు సతమతమవుతున్నారు.
అయితే కార్తీక మాసం( Karthika Masam )లో మాంసాహారులు అసలు కోడిగుడ్లను ముట్టనే ముట్టరు. అంతేకాకుండా చాలా మంది అయ్యప దీక్షలో ఉన్నారు. వీరి కుటుంబాలు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్లరు. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల వినియోగం కూడా తగ్గుతుంది. అయినా కూడా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మార్కెట్‌లో గుడ్ల ధర పెరిగేసరికి వినియోగదారులు బలవంతంగా కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారు.
ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం పౌల్ట్రీ ఫార్ముల్లో కోళ్ల మరణాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఒక పెద్ద పౌల్ట్రీ ఫామ్‌లో నాలుగు నెలల క్రితం 80 వేలకు పైగా కోళ్లు వైరస్ కారణంగా చనిపోయాయి. ఈ సంఘటన ఒక్కటే కాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి తగ్గితే సరఫరా తగ్గుతుంది. దాంతో ధరలు చురుకుగా ఎగసిపడుతున్నాయి.
