Spot-tailed Pitviper | పాములంటే( Snakes ) మనకు కట్ల పాటు, పసర పాము, నాగుపాము( King Cobra ), జెర్రిపోతు, రక్త పింజర వంటివి గుర్తుకు వస్తాయి. కానీ ఓ అరుదైన పామును మీరు చూసి ఉండకపోవచ్చు. దాని పేరు కూడా విని ఉండకపోవచ్చు. కానీ పచ్చని చెట్ల కొమ్మలపై నిగనిగలాడుతూ, మెరిసిపోతూ.. కాకినాడ జిల్లా( Kakinada District ) కోరింగ వన్యప్రాణి అభయారణ్యం( Coringa Wildlife Sanctuary )లో దర్శనమిచ్చింది. ఆ పాము పేరే స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్( Spot-tailed Pitviper ). ఈ పాముకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మడ అడవుల్లో..
మడ అడవుల్లో నివసించే ఈ పాము.. దేశంలోనే మూడో అతిపెద్ద కోరింగ అభయారణ్యంలో తారసపడింది. దాదాపు 40 ఏండ్ల క్రితం జనావాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతి పాము సమీప భవిష్యత్‌లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్‌లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం సత్వరమే ప్రయత్నించకుంటే.. అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ క్రమంలో స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్‌లోకి చేర్చారు.
రాత్రి వేళల్లోనే వేటాడుతుంది..
పొడ పాము జాతికి చెందిన ఈ పాము పగటి పూట మొత్తం ఎవరికీ కనిపించకుండా.. పచ్చిన చెట్లపై సేద తీరుతుంది. పొద్దంతా నిద్రావస్థలోనే ఉంటుంది. ఇక కాస్త చీకటి పడగానే.. వేట మొదలుపెడుతుంది. చెట్లపై నుంచి కిందకు దిగి వేటాడుతుంది. రాత్రిపూత మాత్రమే సంచరిస్తుండడంతో.. ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురుకాలేదు. ఈ పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్‌లలో మాత్రమే కనిపిస్తుంటాయి.
అత్యంత విషపూరితం..
స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్ అత్యంత విషపూరితమైనది. ఈ పాము మనిషిని కాటేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. బ్రెయిన్ డెడ్, గుండెపోటు రావడంతో పాటు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇంత వరకూ ఈ పాము కాటేసిన దాఖలాలు ఎక్కడా లేవు.
మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువ..
తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక భాగం ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. ఇక మగపాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు(22.6 అంగుళాలు) పొడవు ఉంటుంది. దీని తోక పొడవు 120 మిల్లీమీటర్లు(4.7 అంగుళాలు)పైనే ఉంటుంది. ఇక ఆడపాము విషయానికి వస్తే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు(41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు(6.5 అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము అంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.