- విచారణకు సహకరించడం లేదు
- సుప్రీంకోర్టులో ప్రభుత్వ అడ్వొకేట్
- ప్రభాకర్‌రావు బెయిల్ పిటిషన్‌పై వాదనలు
- విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా
న్యూఢిల్లీ : తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ బెయిల్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో దర్యాప్తు కొనసాగుతున్నదని జస్టీస్ బీవీ నాగరత్న ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా తెలిపారు. సిట్ అధికారుల ఎంక్వయిరీకి ప్రభాకర్ రావు సహకరించడం లేదని వివరించారు. ఆయన అందజేసిన ఫోన్‌లలోని డాటాను ఫార్మాట్ చేశారని, వాటిని రిట్రైవ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఎస్ఐబీకి ఇచ్చిన ల్యాప్ టాప్ డాటా పరిస్థితి కూడా అంతే ఉందని చెప్పారు. దాని డాటా రికవరీ కావడం లేదన్నారు. అందులో ఎలాంటి సమాచారం లేదని వివరించారు. ఎంక్వయిరీకి ప్రభాకర రావు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఇప్పటికే పదిసార్లు విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఇరువురి వాదనలు పరిశీలించిన ధర్మాసనం విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంటూ 22 సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.